జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా మార్కెటింగ్ సొసైటీలకు సంబంధించిన డైరెక్టర్ల స్థానాలకు సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలు కావడంతో ఈ రెండు సంఘాలకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కార్యాలయ సమావేశ మందిరంలో వేరువేరుగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. డీసీసీబీ ఎన్నికల అధికారిగా కొత్తగూడెం జిల్లాకు చెందిన డీసీవో మైఖేల్‌బోస్ నామినేషన్లను స్వీకరించారు. సహాయ ఎన్నికలాధికారిగా ఖమ్మం జిల్లా అడిషనల్ రిజిస్టార్ అవదానుల శ్రీనివాస్ వ్యవహరించారు. అదేవిధంగా డీసీఎంఎస్ ఎన్నికల అధికారిగా విజయ్‌కుమారి, సహాయ ఎన్నికల అధికారిగా బాలజీ విధులు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అయితే డీసీసీబీ డైరెక్టర్లకు సంబంధించి మొత్తం 20 స్థానాలకు గాను ఎస్సీ-3, ఎస్టీ-1 స్థానాలు మినహా మిగిలిన 16 స్థానాలకు కేవలం సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలు కావడంతో డీసీసీబీ డైరెక్టర్లుగా నామినేషన్ దాఖలు చేసిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్‌కు సంబంధించి మొత్తం 10 డైరెక్టర్ల స్థానాలకుగాను ఎస్సీ-1, ఎస్టీ-1 స్థానాలు మినహా మిగిలిన 8 డైరెక్టర్ల స్థానాలకు 8 సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలు కావడంతో డీసీఎంఎస్ డైరెక్టర్లుగా నామినేషన్ దాఖలు చేసినవారు ఏకగ్రీవం అయ్యారు.
డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు ఏకగ్రీవం