బత్తాయి రైతుకు సర్కారు అండ

బత్తాయి రైతులకు ప్రతిఒక్కరూ అండగా నిలువాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బత్తాయి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ప్రముఖుల సందేశాలతో విరివిగా ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ రైతుబజార్‌లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డితో కలిసి బత్తాయి మార్కెటింగ్‌పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనాను దూరం చేసేందుకు, వ్యాధి నిరోధకశక్తిని పెంచే పండ్లలో బత్తాయి, నిమ్మ తొలిస్థానంలో ఉన్నాయని.. మీడియా ప్రతినిధులు, నటులు బత్తాయి పండ్లను తినడంతోపాటు ప్రజలకు తినాలని సూచించాలని కోరారు. కోల్డ్‌స్టోరేజీలో దాచినవి తింటూ.. తోటల నుంచి తాజాగా తెచ్చినవాటిని వదిలేస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. బత్తాయి పండ్లను సైన్యానికి సరఫరా చేసే అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పొరుగు రాష్ర్టాల్లోని జ్యూస్‌ పరిశ్రమలతో మాట్లాడాలని అధికారులకు సూచిం చారు.