అమెరికాలో చిక్కుబడ్డ విద్యార్థులకు ఊరట

భారత్‌తో సహా వివిధదేశాల నుంచి చదువుకునేందుకు అమెరికాకు వచ్చి కరోనా కల్లోలం కారణంగా ఇబ్బందుల పాలైన విద్యార్థులకు ఊరట కతలిగించే వార్త ఇది. కోవిడ్-19 ఎమర్జెన్సీ కారణంగా అమెరికాలో చిక్కుబడ్డ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. అమెరికాలో ప్రస్తుతం సుమారు రెండున్నర లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. గత కొద్దివారాలుగా వారంతా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అనూహ్య పరిస్థితుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉపాధి అనుమతి కొరకు నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూఎస్‌సీఐఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా కేసులను బట్టి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం క్యాంపస్‌లు మూసేయించడంతో విదేశీ విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి అచ్చంగా రోడ్డున పడ్డారు. తిరిగి ఆగస్టు చివరలోగానీ క్యాంపస్‌లు తెరుచుకోవు. అనేకమంది లాక్‌డౌన్‌కు ముందే స్వదేశం వెళ్లిపోయారు. విమానాలు ఆపేయడంతో ఇంకా చాలామంది అక్కడే ఉండిపోయారు. వారిలో అనేకమందికి అమెరికాలోని ఎన్నారై హోటలియర్లు బస, భోజన వసతి సమకూర్చి ఆదుకున్నారు. ఈ సహాయాన్ని అందుకోలేనివారు నానా ఇబ్బందులు పడుతున్నారు.